Monday, July 22, 2019

దురాశ డబ్బుకు చేటు అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్న వైనం సైబర్‌ నేరగాళ్లు, గొలుసుకట్టు సంస్థల మాయలో బాధితులు తొలి ఆరునెలల్లోనే ఇబ్బడిముబ్బడిగా కేసులు

దురాశ డబ్బుకు చేటు 
అవగాహన కల్పిస్తున్నా మోసపోతూనే ఉన్న వైనం
సైబర్‌ నేరగాళ్లు, గొలుసుకట్టు సంస్థల మాయలో బాధితులు
తొలి ఆరునెలల్లోనే ఇబ్బడిముబ్బడిగా కేసులు

మీరు ఫలానా సంస్థ లాటరీ కింద రూ.కోటి గెలుచుకున్నారు. మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు తెలిపితే డబ్బు పంపిస్తాం’.‘రూ.లక్ష చెల్లించి మా సంస్థలో చేరండి.. ఇంకో ఇద్దరిని చేర్పించండి.. ఇంట్లో ఉంటూనే కోటీశ్వరులైపోండి.’ ఇటువంటి సందేశాలు, ఫోన్లు నిత్యం ఎంతోమందికి వస్తుంటాయి. వాటికి స్పందిస్తూ పలువురు మోసపోతున్నారు. పది రూపాయలు పెడితే వంద వస్తుందనగానే ముందూ వెనకా ఆలోచించకుండా డబ్బులు కట్టి లబోదిబోమనేవారు ఎందరో. ఈ తరహా మోసాలపై పోలీస్‌శాఖ ప్రచార చిత్రాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అనేకమందిలో ఇంకా మార్పు రావడం లేదు.
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌
నగరంలో గొలుసుకట్టు సంస్థలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగులే లక్ష్యంగా పన్నుతున్న వలలో కొందరు యువత చిక్కుతున్నారు. ఒక సంస్థపై వేటు పడితే మళ్లీ కొత్త పేరుతో, వింతవింత ఆఫర్లతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బయటి వ్యక్తులైతే నమ్మరనే ఆలోచనతో ఇటీవల దగ్గరి బంధువులతోనే మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారు. క్యూనెట్‌ వంటి సంస్థలు నగరంలో వందలమందిని ఇలానే మోసగించాయి. సైబర్‌ నేరాలను ఎప్పటికప్పుడు పోలీస్‌ శాఖ దృష్టికి బాధితులు తీసుకొస్తున్నా గొలుసుకట్టు మోసాల విషయంలో అలా జరగడం లేదు. బాధితులు తప్పు తమదేనన్న భావనలో మిన్నుకుండిపోతున్నారు.
తిరిగి రావడం కష్టం... 
బెంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాల నుంచి నేరస్థులు ఫోన్లు చేసి మోసగించి తప్పించుకుంటున్నారు. కొత్త సాంకేతికతతో ఖాతాల నుంచి నగదు దోచుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. వారు దోచుకున్న డబ్బులు రాబట్టలేకపోతున్నారు.
ఒక్కసారి ఆలోచించండి 
బ్యాంకు అధికారులు మనకు ఫోన్లు చేసి ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఖాతా వివరాలు అడగరన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు సంబంధిత బ్యాంకుకు ఫోన్‌చేసి వాకబు చేయాలి. ఒకవేళ నేరస్థులు మనకు డబ్బులివ్వాలనుకుంటే నేరుగా ఇవ్వకుండా ముందుగా కొంత ఎందుకు కట్టమంటున్నారో విచక్షణతో ఆలోచించాలి.
నిరుద్యోగుల బలహీనత ఉద్యోగం, డబ్బు.. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని సంస్థలు ఎర వేస్తున్నాయి.. ఉద్యోగమంటే జీతమివ్వాలి కానీ మననుంచి ఒక్క రూపాయి తీసుకోకూడదనే విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాలి.
అంతర్జాలంలో ప్రముఖ కంపెనీల ఉత్పత్తులు తక్కువ ధరకే అంటూ ఊరించే వారి సంఖ్య పెరుగుతోంది. బ్రాండెడ్‌ వస్తువులు ఎప్పుడూ తక్కువ ధరలకు అమ్మరు. అమ్మినా వారి దుకాణాల్లో తప్ప బయటెక్కడా వాటిని ఉంచరు. ఇలాంటివి కొనాలనుకున్నప్పుడు ‘క్యాష్‌ ఆన్‌ డెలీవరి’ని ఎంచుకోవడం ఉత్తమం.
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే సమయంలో కార్డు, పాస్‌వర్డు తదితర వివరాలు ఇవ్వకూడదు. వ్యక్తిగత సమాచారం అడిగితే ఆ సైట్‌ని వదలడమే ఉత్తమం. ః విదేశాల్లో ఉద్యోగం అని చెప్పేవారున్నారు. మనం ఏ దరఖాస్తు నింపకుండానే, సంతకాలు చేయకుండానే వీసా వచ్చిందని చెబుతారు. చివరిక్షణం దాకా విమానయాన టిక్కెట్లు చూపించరు. ఇలాంటివాటిని ముందే గుర్తించి పోలీసులకు తెలపాలి. ః అపరిచిత మెయిళ్లను ఎప్పటికప్పుడు తొలగించాలి.
ఇది తెలుసా.. 
కేంద్ర ప్రభుత్వం గతయేడాది చివర్లో వెల్లడించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి పది నిమిషాలకు ఒకరు సైబర్‌ నేరాలకు బాధితులవుతున్నారు. గత పదేళ్లతో పోల్చుకుంటే దాదాపు 19రెట్లు ఈ నేరాలు పెరిగాయి.
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 500 వరకు సైబర్‌ నేరాలు నమోదయ్యాయి.  ఇందులో రాచకొండ పరిధిలో చూస్తే 2018లో ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన కేసులు 260 వరకు ఉండగా.. ఈ సంవత్సరం ఇప్పటికే 150కు పైగా ఉన్నాయి.
పోలీసుశాఖ దృష్టికి రానివెన్నో.
సినీ తారలతో ప్రచారం నిర్వహించినా.. 
సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసుశాఖ పలు ప్రచారచిత్రాలు రూపొందించింది. లఘుచిత్రాలలో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నటులు జూ.ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, నవదీప్‌ తదితరులను భాగం చేసింది. ఒక్కో నటుడు ఒక్కో నేరం గురించి ఈ వీడియోల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తారు. తమ అభిమాన తారలు చెబితేనైనా ప్రజలు వింటారనేది పోలీసు అధికారుల ఆలోచన. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పొందాయి. అయినా కొందరు యథావిధిగా అజ్ఞాత వ్యక్తుల మాయలో చిక్కుతూనే ఉన్నారు.
ముందు జాగ్రత్తలు అవసరం.. 
- హరనాథ్‌, సైబర్‌ క్రైం ఏసీపీ, రాచకొండ
ప్రతిదీ కూర్చున్న దగ్గరకే రావాలన్న ఆలోచనతో వ్యక్తిగత వివరాలన్నీ ఆన్‌లైన్‌ సంస్థలకు ఇచ్చేస్తున్నాం. అది సరికాదు. గోప్యత అవసరం. వాటిని హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు పూర్తి వివరాలు సేకరించి మనలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అన్ని అంతర్జాల సైట్లను నమ్మొద్దు. ఉచితంగా, తక్కువ ధరల్లో వస్తున్నాయనే మాటలు విని మోసపోవద్దు. ఒకవేళ ఇలాంటి తప్పుడు సమాచారం వస్తే వెంటనే పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలి.
మోసాలను సైబర్‌ సెల్‌ దృష్టికి తీసుకెళ్లాలి. 040-27852412, 100 నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు.

No comments:

Post a Comment