Tuesday, July 2, 2019

#2 జేబులోనే కార్డు.. ఖాతా మాత్రం ఖాళీ

జేబులోనే కార్డు.. ఖాతా మాత్రం ఖాళీ
కొత్త తరహాలో సైబర్‌ నేరస్థుల స్వాహాయనం 
మల్కాజిగిరికి చెందిన విద్యార్థిని(25)కి స్థానికంగా ఓ జాతీయ బ్యాంకులో ఖాతా ఉంది. గత నెల 27, 28 తేదీల్లో సైబర్‌ నేరస్థులు ఆమెకు తెలియకుండానే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కొట్టేశారు. ఎనిమిది విడతల్లో రూ.80వేలు స్వాహా చేశారు. డెబిట్‌ కార్డు ఆమె వద్ద ఉండగానే ఈ మోసం జరగడంతో రెండు రోజుల క్రితం రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా నేరస్థులు రాజస్థాన్‌ నుంచి ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. బాధితురాలి ఖాతా నుంచి మాయమైన డబ్బుల్ని రాజస్థాన్‌లో డ్రా చేసినట్లు వెల్లడైంది. 


 హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అంతర్జాలం వేదికగా బాధితులను బురిడీ కొట్టిస్తూ వారికి తెలియకుండానే బ్యాంకు ఖాతాల్లోని నగదును స్వాహా చేస్తున్నారు. బ్యాంకు అధికారుల మాదిరిగా ఖాతాదారులకు ఫోన్లు చేస్తూ డెబిట్‌కార్డు వివరాల్ని తెలుసుకొని... డబ్బు కాజేసే ఉదంతాలు ఇప్పటివరకు తరచూ వెలుగు చూసేవి. డెబిట్‌కార్డు కాలపరిమితి ముగుస్తుందనో.. అప్‌గ్రేడ్‌ చేస్తున్నామనో చెప్పి కార్డు, సీవీవీ, పిన్‌ నంబర్లతోపాటు ఇతర వివరాల్ని సేకరించే వారు. అనంతరం ఆ వివరాల ఆధారంగా.. లావాదేవీ జరిపి.. ఆ సమయంలో కార్డుదారుడికి వచ్చే ఓటీపీనీ తెలుసుకొని డబ్బు కొట్టేసేవారు. కానీ ఇటీవలికాలంలో నేరస్థులు కొత్త పద్ధతుల్ని ఎంచుకొన్నట్లు పోలీసుల దర్యాప్తు వెల్లడిస్తోంది. కార్డుదారులకు ఎలాంటి ఫోన్లు చేయకుండానే కార్డు వివరాల్ని పసిగట్టి డబ్బు స్వాహా చేస్తున్నారు. ఖాతా నుంచి నగదు బదిలీ జరిగినట్లు చరవాణికి సంక్షిప్త సందేశం వస్తేగానీ నేరం జరిగినట్లు బాధితులు గుర్తించలేకపోతున్నారు. తాజాగా మల్కాజిగిరి ఉదంతంలో ఇదే జరిగింది. ఎలాంటి ఫోన్‌ చేయకుండానే బాధితురాలి ఖాతా నుంచి డబ్బు తీసుకోవడం.. విస్మయం కలిగించే అంశం. డెబిట్‌కార్డు బాధితురాలి వద్ద ఉండగానే.. ఆమె ప్రమేయం  లేకుండానే డబ్బు మాయం కావడం గమనార్హం.
డార్క్‌నెట్‌ నుంచి ...
డెబిట్‌ కార్డుల వివరాల్ని తెలుసుకొనేందుకు సైబర్‌ మోసగాళ్లు డార్క్‌నెట్‌లో శోధిస్తున్నారు. ఈ చీకటి సామ్రాజ్యాన్ని నిర్వహించే ఘరానా ముఠాలు... ఆయా కార్డుల నంబర్లని విక్రయిస్తుండటంతో నేరస్థులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి కార్డు వివరాల్ని తీసుకొని భద్రపరిచే ఏజెన్సీల్లో పనిచేసే కొందరు సిబ్బంది డబ్బులకు ఆశపడి.. ఈ వివరాల్ని డార్క్‌నెట్‌ నిర్వాహకులకు విక్రయిస్తుండటంతో ఈ మోసాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఆ వివరాలతో క్లోనింగ్‌ ప్రక్రియలో నకిలీ డెబిట్‌కార్డుల్ని సృష్టించి ఏటీఎం యంత్రాల ద్వారా డబ్బు కొట్టేస్తున్నారు. సాధారణంగా ఈ తరహా నేరాల్లో బాధితులు ఎక్కువ మంది సైబర్‌ మోసగాళ్లు అడిగిన సమయంలో ఓటీపీ, సీవీవీ, పిన్‌నంబరు తదితర వివరాలను చెప్పి మోసపోతుంటారు. నేరస్థులు బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్‌ చేస్తే నిజమే అని నమ్మి ఆ వివరాలు చెప్పేస్తున్నారు. అలాంటి ఉదంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా..  నేరస్థుల నుంచి తిరిగి డబ్బు తెప్పించడం కనాకష్టం. ఓటీపీ లేదా ఇతర వివరాలు చెప్పకుండానే డబ్బు పోగొట్టుకుంటే మాత్రం.. తిరిగి పొందే వీలుంది. బ్యాంకు అధికారుల వద్ద ఈ వివాదాన్ని లేవనెత్తితే.. ఆ డబ్బును తిరిగి ఖాతాదారుడికి చెల్లిస్తారు.
అంచనాల ఆధారంగా...
మరికొందరు సైబర్‌ నేరస్థులు ఇంకో పద్ధతిని అనుసరిస్తున్నారు. కొన్ని బ్యాంకుల డెబిట్‌కార్డు నంబర్ల మొదటి అంకెలు ఏకరీతిన ఉండటం వీరికి కలిసివస్తోంది. మిగిలిన అంకెల్ని అంచనా ప్రకారం నమోదు చేస్తూ కార్డు నంబరును కనుగొంటున్నారు. ఇందుకోసం కొన్ని యాప్‌లను వినియోగిస్తున్నారు. అనంతరం పిన్‌నంబరును వందల సార్లు రాండమ్‌గా నమోదు చేస్తూ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ‘1111’, ‘1234’, ‘5678’.. తదితర ఫ్యాన్సీ నంబర్లను నమోదు చేస్తూ కనిపెట్టగలుగుతున్నట్లు సమాచారం. అలాంటి ఫ్యాన్సీ నంబర్లను పిన్‌నంబర్‌గా పెట్టుకున్న కార్డుదారులు ఈ మోసగాళ్లకు బలవుతున్నారు.

No comments:

Post a Comment