Tuesday, July 2, 2019

#3 ఎల్ ఎల్ ఆర్ పొందటం తేలిక

ఎల్ ఎల్ ఆర్ పొందటం తేలిక 
కొత్తగా ‘వాక్‌ ఇన్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌’ విధానం
నేటి నుంచి రవాణా కార్యాలయంలో అమలు
నిరక్షరాస్యులు, కంప్యూటర్‌పై అవగాహన లేని వారికి మేలు

ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షలో పాల్గొన్న యువకులు (పాతచిత్రం) 

జిల్లాలో చాలా మంది నిరక్షరాస్యులు, కంప్యూటర్‌ పరీక్ష పట్ల అవగాహన లేని చోదకులు లైసెన్సు లేకుండానే వాహనాలను నడుపుతున్నారు. దీంతో రవాణా, పోలీస్‌ అధికారుల తనిఖీల్లో వారంతా పెద్దఎత్తున జరిమానాలు చెల్లిస్తున్నారు. ఒకవేళ ప్రమాదాలు సంభవిస్తే లైసెన్సులు లేకపోవడం వల్ల బీమా రాకుండా, అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వీరి సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికీ తప్పకుండా లైసెన్సు ఉండేలా చూడడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షను మరింత సులభతరం చేసి వారికి లైసెన్సులను అందించాలని ప్రభుత్వం భావించి ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది.
లెర్నింగ్‌ లైసెన్సు (ఎల్‌ఎల్‌ఆర్‌)ను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా నూతనంగా
‘వాక్‌ ఇన్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌’ విధానాన్ని జులై 3 నుంచి ప్రవేశ పెట్టనున్నట్లుగా రవాణా శాఖ ఉప కమిషనర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు తెలియజేశారు.
ఈ విధానంలో నిరక్షరాస్యులకు, కంప్యూటర్‌పై అవగాహన లేని చోదకులకు సహాయం చేయటం ముఖ్య ఉద్దేశం. చదువు రాని వారికి నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలను వినిపించి, వారు చెప్పిన సమాధానాల్ని నమోదు చేస్తారు. కంప్యూటర్‌పై అవగాహన లేని వారికి అధికారులే సహాయం చేసి వారిచే పరీక్ష రాయిస్తారు. ముందుగా సమయం తీసుకోలేని వారికి కార్యాలయంలో అప్పటికప్పుడు సమయం ఇచ్చే అవకాశం కూడా కల్పించనున్నారు.
- మాధవధార, న్యూస్‌టుడే 
అభ్యర్థులు తీసుకురావల్సిన ధ్రువపత్రాలు ఇవీ..
● ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష కోసం వచ్చే చోదకులకు 18 ఏళ్లు నిండి ఉండాలి. వాహనం నడపగలిగిన వారై ఉండాలి, నేర్చుకోగలిగిన వారై ఉండాలి.
*● ఆధార్‌, చిరునామా, వయస్సుకి సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకురావాలి.
*● పరీక్షకి సంబంధించిన రుసుములను మాత్రం ఆన్‌లైన్‌లో చెల్లించాలి. సమయం తీసుకునేటప్పుడు డెబిట్‌ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనానికి రూ.260, ద్విచక్ర, నాలుగు చక్రాలు రెండింటికీ రూ.410 చెల్లించాల్సి ఉంటుంది.
నూతన విధానంలో ఇలా..
*● రవాణా కార్యాలయంలో ఏరోజుకారోజు సమయం తీసుకోవచ్ఛు దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
*● సమయం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రహదారి నిబంధనల పట్ల ప్రత్యేక తరగతులు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు.
*● కంప్యూటర్‌ పరీక్షపై అవగాహన ఉన్నవారికి యథావిధిగా పరీక్ష నిర్వహిస్తారు.
*● చదువురాని నిరక్షరాస్యులకు నిబంధనలకు సంబంధించిన 20 ప్రశ్నలను చదివి వినిపిస్తారు. అందులో వారు చెప్పిన జవాబులను నమోదు చేస్తారు. అందులో 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే, ఉత్తీర్ణత సాధించినట్లుగా ధ్రువపత్రాన్ని అందజేస్తారు.
*● కంప్యూటర్‌పై అవగాహన లేని వారికి, పరీక్షకు సంబంధించిన ప్రశ్నలకు ఏ విధంగా జవాబులు రాయాలో సహాయం చేసి, ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకుంటారు.
*● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఎవరైతే ముందు వస్తారో వారికి క్రమపద్ధతిలో టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్‌ ఉన్న వారికి శిక్షణ ఇచ్చి, పరీక్ష రాయిస్తారు. ఇలా రోజుకు 100 నుంచి 150 మంది వరకు పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి రోజు కార్యాలయానికి ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షకు వచ్చే చోదకులకు వరుస క్రమంలో టోకెన్లు ఇస్తారు.

No comments:

Post a Comment