బాధితులలో గృహిణులే అధికం
నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్
నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్
హైదరాబాద్: ప్రముఖ హోటల్‌లో రిసెప్షనిస్ట్ ఉద్యోగాల పేరిట మభ్యపెట్టి మహిళల నగ్నచిత్రాలు సేకరించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్లెమెంట్ రాజ్ అలియాస్ ప్రదీప్ పాపాల చిట్టా విప్పేందుకు సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. చెన్నైకి చెందిన ప్రదీప్ గత 8 నెలలుగా మహిళలను ఉచ్చులోకి లాగే పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రివేళ విధులకు వెళ్లే ప్రదీప్ పగలు ఇంట్లోనే ఉండేవాడు. క్వికర్.కాం దరఖాస్తుల్లోంచి మహిళలను ఎంచుకొని ఫోన్లో మాట్లాడేవాడు. ఓ యువతి పేరుతో వాట్సాప్‌లో ఇంటర్వ్యూ చేసేవాడు. ఈక్రమంలోనే తెలివిగా మహిళల నగ్నచిత్రాలను సేకరించాడు. అవతలి వైపు అమ్మాయే కదా అనే ఉద్దేశంతో బాధితురాళ్లు అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. చిత్రాలు తన చేతికి చిక్కిన తర్వాత తానే స్వయంగా వీడియోకాలింగ్‌లో మాట్లాడేవాడు. ప్రదీప్ అమ్మాయి కాదని తెలిసి బాధితులు ఎందుకు సంభాషణలు సాగించారనేది విస్మయకర అంశంగా మారింది. తనతో మాట్లాడకపోతే నగ్న దృశ్యాలను బయట పెడతానని బెదిరించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతడి వ్యవహారాన్ని ఇంకా లోతుగా తేల్చాలంటే అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని కూకట్‌పల్లి న్యాయస్థానంలో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో వాదనలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పది మందికిపైగా గుర్తింపు.. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ప్రదీప్ బాధితురాళ్లున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి చరవాణిని విశ్లేషించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన పది మందికిపైగా మహిళలను అతడు మభ్యపెట్టినట్లు తేలింది. మియాపూర్‌కు చెందిన ఓ మహిళ ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో ప్రదీప్ దురాగతాలు బహిర్గతమైనా.. మిగిలినవారు భయంతో ముందుకు రావడం లేదు. అతడి చరవాణిలోని ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. వీలైనంతమందితో ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాళ్ల విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటామని భరోసా ఇస్తున్నారు. వారిలో ఎక్కువగా గృహిణులే ఉన్నారు.
విస్తుపోయిన కుటుంబసభ్యులు.. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకొని బుద్ధిగా సంసారం సాగించిన ప్రదీప్ నిర్వాకం ఇలా బహిర్గతం కావడం అతడి కుటుంబసభ్యులను విస్తుపోయేలా చేసింది. మియాపూర్ బాధితురాలి ఫిర్యాదుతో ప్రదీప్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో తొలుత కుటుంబసభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. పోలీసులు ఆధారాలు చూపడంతో మిన్నకుండిపోయినట్లు సమాచారం.
No comments:
Post a Comment