Monday, August 26, 2019

ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి

ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. ప్రేమించిన యువకుడే దారుణంగా హత్య చేశాడు. ఆదివారం సాయంత్రం ఆమెను గుట్టపైకి తీసుకెళ్లిన యువకుడు.. చేతి రుమాలును ఆమె గొంతుకు బిగించి ప్రాణాలు తీశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెనుబల్లి మండలం కుప్పినకుంట్లకు చెందిన కావిటి తేజస్విని(20) సత్తుపల్లి మండలం గంగారంలో సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్‌ కళాశాలలో గతంలో పాలిటెక్నిక్‌ చదివింది. సత్తుపల్లికి చెందిన నితిన్‌ కూడా అదే కళాశాలలో చదివాడు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పాలిటెక్నిక్‌లో కొన్ని సబ్జెక్టులు ఫెయిలై తేజస్విని ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. నితిన్‌ ఖమ్మంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తేజస్వినిని ద్విచక్రవాహనంపై ఇంటినుంచి తీసుకువెళ్లాడు. తమ కుమార్తె కనిపించకపోవడంతో యువతి తల్లిదండ్రులు సోమవారం వీఎమ్‌బంజర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తేజస్విని ఫోన్‌ కాల్‌డేటాలో నితిన్‌ నెంబరును గుర్తించారు. నితిన్‌ ఖమ్మం వసతి గృహంలో ఉన్నట్లు గుర్తించి మంగళవారం వేకువజామున అదుపులోకి తీసుకొని విచారించగా తాను చేతి రుమాలుతో హత్యచేసినట్లుగా పోలీసులకు చెప్పాడు. ఘటనాస్థలంలో గాలించగా మృతదేహం లభ్యమైంది. కల్లూరు ఏసీపీ వెంకటేశ్‌, సత్తుపల్లి సీఐ సురేష్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఛాటింగ్‌ అన్నారు.. చాటింపేశారు!

ఛాటింగ్‌ అన్నారు.. చాటింపేశారు!
  యువతులతో గడపవచ్చంటూ ప్యాకేజీల మోసం
 లవ్‌ ఆర్ట్‌ డేటింగ్‌ వెబ్‌సైట్‌తో  రూ.కోట్లలో వసూళ్లు
హైదరాబాద్‌: ‘‘అందమైన అమ్మాయిలతో మాట్లాడండి... డేటింగ్‌కు ఇష్టపడే వారితో గడపండి. నెల.. మూడు నెలలు.. సంవత్సరం.. ప్యాకేజీలున్నాయి’’ అంటూ కోల్‌కతా కేంద్రంగా రూ.కోట్లు కొల్లగొడుతున్న ముగ్గురు సైబర్‌ నేరస్థులు సోమా సర్కార్‌, అంబాసుర్‌, ఇమ్రాన్‌లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘లవ్‌ ఆర్ట్‌ డేటింగ్‌’ వెబ్‌సైట్‌ పేరుతో రెండేళ్ల నుంచి దేశవ్యాప్తంగా వీరు యువకులను ఆకర్షించి రూ. 8 కోట్లు కొల్లగొట్టారని అదనపు డీసీపీ కె.సి.ఎస్‌.రఘువీర్‌ సోమవారం తెలిపారు. వీరితో పాటు కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న 20 మంది యువతులను అరెస్ట్‌ చేశారు. కోల్‌కతాకు చెందిన సోమా సర్కార్‌ రెండేళ్ల కిందట ఒక కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేసింది. అంబాసుర్‌, ఇమ్రాన్‌లను మేనేజర్లుగా, ఇరవైమంది యువతులను టెలీకాలర్లుగా నియమించుకుంది. నష్టాలు రావడంతో పంథా మార్చేసి డేటింగ్‌ సైట్‌ను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్‌ రుసుం రూ. 1,025, ప్యాకేజీల ఆధారంగా గరిష్ఠంగా రూ. 18,000 వరకు చెల్లించాలి. మాటల వరకు చాలంటే రోజుకు ఒకసారి ఒక యువతి గంటసేపు మాట్లాడుతుంది. డేటింగ్‌కు రావాలంటే సభ్యులు ఏ నగరంలో ఉంటే.. ఆ నగరంలోనే యువతులు వస్తారని చెబుతుంది. యువతుల ఫొటోలు, వారి వివరాలు ఉండడంతో వందలమంది యువకులు సభ్యత్వ రుసుం చెల్లించారు. సోమా కాల్‌సెంటర్‌లో పనిచేసే యువతులే వారితో మాట్లాడేవారు.

బాధితుల ఫొటోలు డేటింగ్‌ వెబ్‌సైట్‌లో..
సభ్యత్వ రుసుం చెల్లించిన యువకులు డేటింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాం.. అని చెప్పగానే వారి ఫొటోలు, ఫోన్‌ నంబర్లు, చిరునామాలను సేకరించేవారు. అనంతరం వాటిని ఇతర డేటింగ్‌ సైట్లలో ఉంచేవారు. తర్వాత వారికి ఫోన్‌ చేసి ‘మీ ఫొటోలు ఫలానా వెబ్‌సైట్లలో ఉన్నాయి. మీరు అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని కోల్‌కతాలో మీపై కేసులు నమోదవుతున్నాయి.. పోలీసులు అరెస్ట్‌ చేయకుండా ఉండాలంటే కొంత సొమ్ము చెల్లించాలంటూ’ బాధితులను బెదిరించి డబ్బు వసూలు చేసేవారు. ఇలా సోమా సర్కార్‌ చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై దృష్టి పెట్టారు. ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు తన బృందంతో కలిసి కోల్‌కతాకు వెళ్లి ఆదివారం వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకువచ్చి జైలుకు తరలించారు.

సైబర్‌ కామాంధుడి లీలలు ఎన్నెన్నో!

సైబర్‌ కామాంధుడి లీలలు ఎన్నెన్నో!
బాధితులలో గృహిణులే అధికం
నిందితుడిని కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్‌
హైదరాబాద్‌: ప్రముఖ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌ ఉద్యోగాల పేరిట మభ్యపెట్టి మహిళల నగ్నచిత్రాలు సేకరించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ క్లెమెంట్‌ రాజ్‌ అలియాస్‌ ప్రదీప్‌ పాపాల చిట్టా విప్పేందుకు సైబరాబాద్‌ పోలీసులు దృష్టి సారించారు. చెన్నైకి చెందిన ప్రదీప్‌ గత 8 నెలలుగా మహిళలను ఉచ్చులోకి లాగే పనిలో నిమగ్నమయ్యాడు. రాత్రివేళ విధులకు వెళ్లే ప్రదీప్‌ పగలు ఇంట్లోనే ఉండేవాడు. క్వికర్‌.కాం దరఖాస్తుల్లోంచి మహిళలను ఎంచుకొని ఫోన్లో మాట్లాడేవాడు. ఓ యువతి పేరుతో వాట్సాప్‌లో ఇంటర్వ్యూ చేసేవాడు. ఈక్రమంలోనే తెలివిగా మహిళల నగ్నచిత్రాలను సేకరించాడు. అవతలి వైపు అమ్మాయే కదా అనే ఉద్దేశంతో బాధితురాళ్లు అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. చిత్రాలు తన చేతికి చిక్కిన తర్వాత తానే స్వయంగా వీడియోకాలింగ్‌లో మాట్లాడేవాడు. ప్రదీప్‌ అమ్మాయి కాదని తెలిసి బాధితులు ఎందుకు సంభాషణలు సాగించారనేది విస్మయకర అంశంగా మారింది. తనతో మాట్లాడకపోతే నగ్న దృశ్యాలను బయట పెడతానని బెదిరించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతడి వ్యవహారాన్ని ఇంకా లోతుగా తేల్చాలంటే అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని కూకట్‌పల్లి న్యాయస్థానంలో పోలీసులు పిటీషన్‌ దాఖలు చేశారు. రెండు రోజుల్లో వాదనలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పది మందికిపైగా గుర్తింపు.. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ప్రదీప్‌ బాధితురాళ్లున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి చరవాణిని విశ్లేషించారు. అందులో హైదరాబాద్‌కు చెందిన పది మందికిపైగా మహిళలను అతడు మభ్యపెట్టినట్లు తేలింది. మియాపూర్‌కు చెందిన ఓ మహిళ ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో ప్రదీప్‌ దురాగతాలు బహిర్గతమైనా.. మిగిలినవారు భయంతో ముందుకు రావడం లేదు. అతడి చరవాణిలోని ఫోన్‌ నంబర్ల ఆధారంగా పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. వీలైనంతమందితో ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాళ్ల విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొంటామని భరోసా ఇస్తున్నారు. వారిలో ఎక్కువగా గృహిణులే ఉన్నారు.

విస్తుపోయిన కుటుంబసభ్యులు.. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకొని బుద్ధిగా సంసారం సాగించిన ప్రదీప్‌ నిర్వాకం ఇలా బహిర్గతం కావడం అతడి కుటుంబసభ్యులను విస్తుపోయేలా చేసింది. మియాపూర్‌ బాధితురాలి ఫిర్యాదుతో ప్రదీప్‌ను అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సమయంలో తొలుత కుటుంబసభ్యుల నుంచి ప్రతిఘటన ఎదురైనట్లు తెలిసింది. పోలీసులు ఆధారాలు చూపడంతో మిన్నకుండిపోయినట్లు సమాచారం.

Friday, August 23, 2019

చెల్లెలిని బంధించి అక్కపై అత్యాచారం

చెల్లెలిని బంధించి అక్కపై అత్యాచారం


కేశవగిరి: తల్లి, సోదరులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఓ బాలుడు(17) బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన బాధితురాలి చెల్లెలిని గదిలో బంధించి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టలో నివసించే ఓ కుటుంబంలోని తల్లి, సోదరులు మంగళవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లారు. బాలిక(16), ఆమె చెల్లెలు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో పెద్దవారు ఎవరూ లేకపోవడం, తలుపు తెరిచి ఉండడంతో బాలుడు లోపలికి ప్రవేశించాడు. బాలిక (16)ను పడకగదిలోకి లాక్కెళ్లాడు. ఇది గమనించిన చెల్లెలు.. అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆమె(చెల్లెలు)ను ఒక గదిలో బంధించాడు. బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లి, సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న బాలుడిని సీఐ రుద్రభాస్కర్‌ ఆధ్వర్యంలో పట్టుకుని జువెనైల్‌ హోంకు తరలించారు.

Friday, August 2, 2019

కమ్మేస్తున్న ‘నీలి’నీడ!

కమ్మేస్తున్న ‘నీలి’నీడ! 
అశ్లీల సైట్లకు బానిసలు అవుతున్న యువత
నగరంలో పెరుగుతున్న వికృత చేష్టలు...
బలవన్మరణాలు సతమతమవుతున్న తల్లిదండ్రులు
ఈనాడు, హైదరాబాద్‌

నగర యువత భవితను ‘నీలి’నీడ కమ్మేస్తోంది. స్మార్ట్‌ ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతులు... పలు సైట్లలోని నీలి చిత్రాలు కుర్రాళ్లపై అటు ఆరోగ్యపరంగా... ఇటు ప్రవర్తన పరంగా విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు యువతీ, యువకుల మధ్య ఆకర్షణ కలగటానికి, పరిచయాలు పెరగటానికి ఈ ఫోన్లే కారణమవుతున్నాయి. గతంలో మార్కులు, ర్యాంకులు సాధించలేమని ఒత్తిడికి గురయ్యే యువత ఇప్పుడు క్షణకాలం ఫోన్లు ఆగినా, పెద్దలు ఆపేసినా  గందరగోళానికి గురవుతున్నట్లు మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.
మునిగిపోతున్నారు...
ఇటీవల ఓ సంస్థ దేశవ్యాప్తంగా యువత ఫోన్ల వినియోగంపై అధ్యయనం చేసింది. సుమారు 18,500 మందితో మాట్లాడి సర్వే నిర్వహించింది. వారిలో 80 శాతం మంది  ప్రతిరోజూ 
3- 7 గంటలు సామాజిక మాధ్యమాల కోసం వెచ్చిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 2,500 మందితో నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ సగానికిపైగా 4 గంటల వరకూ కేటాయిస్తామని వివరించారు. 
స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారు ప్రతిరోజూ సగటున 63 సార్లు ఫోన్‌ చూస్తారు. 
మరో సంస్థ నిర్వహించిన సర్వేలో పోర్న్‌సైట్ల్‌కు బానిసలైన రాష్ట్రాల్లో తెలంగాణ 30వ స్థానంలో ఉంది. నగరాల్లో హైదరాబాద్‌ రెండోస్థానంలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 
అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షలకు పైగా పోర్న్‌సైట్లు ఉంటాయని అంచనా. ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులు పెరగటానికి పోర్న్‌సైట్లు  ఓ కారణమని ఓ వైద్యనిపుణుడు విశ్లేషించారు. 
మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఒంటరితనం, జీవితంపై నిరాశ ఇవన్నీ అలవడేందుకు ఫోన్‌ను ఎక్కువగా వాడటమే కారణమంటున్నారు. ఈ ధోరణిని అదుపు చేయకపోతే వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 
పెద్దలకు తీరని మనోవేదన 
‘మా అబ్బాయి/అమ్మాయికి ఎవరైనా ప్రేమికులు ఉన్నారా?... నా దగ్గరకు కౌన్సెలింగ్‌ కోసం పిల్లల్ని తీసుకువచ్చే అధికశాతం తల్లిదండ్రుల మొదటి అనుమానం ఇది’ అని కన్నవారు పడుతున్న ఆందోళనను ఓ సైకియాట్రిస్టు గుర్తు చేశారు. పిల్లలు నిద్రలోకి జారుకున్నాక వారి ఫోన్లను చాలామంది పెద్దలు తనిఖీ చేస్తున్నారని, చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాదించుకుని మనోవేదనకు గురవుతున్న కన్నవారినీ తాను గమనించానని తన అనుభవాన్ని వివరించారు. 
‘మా దగ్గర చదివే విద్యార్థులు కోర్సుల్లో ఉత్తీర్ణులు అవుతారా! ఉద్యోగాలు సంపాదిస్తారా! అనే దానికంటే.. కళాశాలలో ఉన్నంత సేపూ స్మార్ట్‌ ఫోన్లు వాడకుండా వారిని కట్టడి చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది’ అని ఓ ప్రముఖ కళాశాల ప్రిన్సిపల్‌ ఆవేదన వెలిబుచ్చారు.  
తల్లిదండ్రులు తనకు సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని ఓ డిగ్రీ విద్యార్థి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు నెలల క్రితం ఎస్‌ఆర్‌నగర్‌లో ఏడోతరగతి విద్యార్థిని సెల్‌ఫోన్‌లో మునిగి చదువును నిర్లక్ష్యం చేస్తోందని తల్లి మందలించింది. ఆ బాలిక భవనంపై నుంచి  దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎవరితోనే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని తండ్రి మందలించగా... అదే రోజు నగర శివార్లలో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.  
కొందరు పదోతరగతి విద్యార్థుల దగ్గర  ఖరీదైన ఫోన్లు ఉన్నాయి... ఎలా కొన్నార్రా వాటిని! అని అడిగితే ఉదయం వేళల్లో పేపర్లు, పాల ప్యాకెట్లు వేసి, ఆ వచ్చిన డబ్బుతో అని చెప్పారు. పిల్లలు శ్రమ విలువ తెలుసుకున్నారని సంతోషిస్తే... క్రమంగా ఆ ఫోన్లే వారిని పెడదారి పట్టిస్తున్నాయి... అని  ఓ ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వాపోయారు.  
ఫోన్లు చూడకుండా విద్యార్థులను కట్టడి చేయటం అంత తేలిక కాదని ఓ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఇటీవల గంజాయి రవాణా చేస్తూ చిక్కిన విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ఫోన్లలో భారీగా అశ్లీల వీడియోలున్నట్లు ఆయన వివరించారు.

సహజీవనం చేసినోడే శవాన్ని చేశాడు

సహజీవనం చేసినోడే శవాన్ని చేశాడు


తగరపువలస(విశాఖ): వారిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అనుమానమనే భూతం వీరి మధ్య చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే... తగరపువలస సమీపంలోని చిప్పాడ దివీస్‌ కంపెనీలో రోజు కూలీగా పనిచేస్తున్న కె.శాంతి ఈనెల 25న ఉరివేసుకుని మృతిచెందినట్లు భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు దీనిపై లోతైన విచారణ చేశారు. ఈమెతో సహజీవనం చేస్తున్న చిన్నారావు అనే యువకుడు పిడిగుద్దులు గుద్ది, ఆపై పీక నులిమి ప్రాణాలు తీసినట్లు తేలింది. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బాసగిట్టంగి గ్రామం. నిందితుడిది ఆ పక్కనే ఉన్న పెదగిట్టంగి గ్రామం. ఏడు నెలల కిందట వీరు చిప్పాడ దివీస్‌లో రోజు కూలీలుగా చేరారు. సమీపంలోని రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 25న ఇద్దరూ విధులకు వెళ్లారు. అక్కడ వీరి మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన శాంతి షెడ్డుకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న చిన్నారావు ఆమెను నోటికి వచ్చినట్లు తిట్టాడు. దీంతో ‘నేను నిన్ను పెళ్లిచేసుకోను. నన్ను కొడుతున్నావ్‌..’ అని ఆమె అనడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు పంపినట్లు భీమిలి సీఐ వెంకట నారాయణ తెలిపారు.

స్నేహంగా మెలిగి.. నగ్న చిత్రాలు తీసి!

స్నేహంగా మెలిగి.. నగ్న చిత్రాలు తీసి!

హైదరాబాద్‌: స్నేహం పేరు చెప్పి అమ్మాయితో కలిసి తిరిగాడు.. శీతలపానీయంలో మత్తు కలిపి నగ్న దృశ్యాలను చిత్రీకరించాడు.. అమెరికా వెళ్లి వాటిని నీలిచిత్రాల వెబ్‌సైట్లలో నిక్షిప్తం చేశాడు.. తోటి స్నేహితులు ఆ వీడియోల్ని గుర్తించి బాధితురాలికి చెప్పడంతో అతడి కపట నాటకం బహిర్గతమైంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అతడిపై కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మీర్‌పేట ప్రాంతానికి చెందిన యువతి(24)కి తొమ్మిదేళ్ల క్రితం కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. మూడేళ్ల క్రితం ఆమె డిగ్రీ చదివిన సమయంలో ఇద్దరి స్నేహం బలపడింది. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఇద్దరు కలిసి పలుమార్లు బేకరీకి వెళ్లారు. ఓమారు ఇలాగే తీసుకెళ్లి శీతల పానీయంలో మత్తు గుళికలు కలిపి ఇచ్చాడు. దాన్ని తాగిన బాధితురాలు మత్తులో ఉండగానే ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన చరవాణితో ఆమె నగ్న దృశ్యాలను చిత్రీకరించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోల్ని బాధితురాలికి చూపించాడు. బెదిరిపోయిన బాధితురాలు వాటిని తొలగించాలని ప్రాధేయపడింది. ఈ క్రమంలో వాటిని తొలగించానని ఆమెను నమ్మించి కపట బుద్ధిని ప్రదర్శించాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత పలు నీలిచిత్రాల వెబ్‌సైట్లలో ఆ దృశ్యాలను నిక్షిప్తం చేశాడు. బాధితురాలి స్నేహితురాలు వాటిని చూసి విషయం ఆమెకు చెప్పడంతో అతడి నిర్వాకం బహిర్గతమైంది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉండటంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు వీడియోను నిక్షిప్తం చేసిన ఐపీ అడ్రస్‌ను కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.